Saturday, September 16, 2017

PUBLIC VS PRIVATE LTD COMPANY


ఏది ప్రైవేట్‌.. ఏది పబ్లిక్‌ 
టాటా సన్స్‌ కంపెనీ తాజాగా ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారాలని నిర్ణయించినట్లు నిన్న ఒక వార్త వచ్చింది చూశారా.. ప్రైవేటు కంపెనీగా మారితే ఏం జరుగుతుందన్న సందేహం చాలామందికి కలగొచ్చు. కంపెనీల్లో చాలా రకాలుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ప్రైవేట్‌ లిమిటెడ్‌, పబ్లిక్‌ లిమిటెడ్‌ లేదా లిమిటెడ్‌. మరి టాటా సన్స్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ నుంచి ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎందుకు మారుతోందో ఈ వారం ‘మార్కెట్‌ మాట’లో తెలుసుకుందాం.
ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అంటే
కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడిచే వ్యాపార సంస్థను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా పేర్కొనవచ్చు. ఈ తరహా వ్యాపార సంస్థలో యజమాని బాధ్యత (లయబిలిటీ) షేర్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఒకవేళ కంపెనీకి ఆర్థిక సమస్యలు వచ్చి శాశ్వతంగా మూసేయాల్సి వస్తే అపుడు వాటాదార్ల ఆర్థిక బాధ్యత కేవలం వారి షేర్లకే పరిమితం.
ప్రయోజనాలు
2008, 2009 సంక్షోభ సమయంలో చాలామటుకు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు మూతపడ్డాయి. ఆ సమయంలో వ్యక్తిగత ఆస్తులు కోల్పోకుండా ఈ తరహా కంపెనీల యాజమాన్యాలు బయటపడ్డాయి. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. కంపెనీ నష్టాల్లోపడ్డపుడు కంపెనీ షేర్లను విక్రయించి అప్పులను తీర్చాలి. వ్యక్తిగత ఆస్తులకు ముప్పు ఉండదు.
షేర్ల బదిలీ లేదా విక్రయంపై కొంత పరిమితులుంటాయి. దీనిని ప్రయోజనంగా చూడవచ్చు. ప్రతికూలంగానూ చూసుకోవచ్చు. కొంతమంది వాటాదార్లకు ఇది ప్రయోజనం ఎలాగంటే.. షేర్లను విక్రయించాలంటే.. బయటి వారికి విక్రయించకూడదు. అంటే తెలిసిన వ్యక్తులు/బంధువులే కంపెనీలో ఉంటారు కాబట్టి వారికే విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే మిగతా వాటాదార్లు కూడా అంగీకరించాలి. ఇక ప్రతికూలం ఎలాగంటే.. ఏదైనా అవసరం ఉండి షేర్లను విక్రయించుకునే వారికి అవకాశాలు పరిమితంగా ఉంటాయి.
కేవలం ఇద్దరు సభ్యుల(గరిష్ఠంగా 200)తోనే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించొచ్చు. మూలధనం కూడా కనీసం రూ.లక్ష ఉంటే చాలు.
ఒకవేళ యజమాని చనిపోయినా.. వ్యాపారాన్ని వదిలి వెళ్లినా.. దివాలా ప్రకటించినా ఆ కంపెనీ కొనసాగుతుంది. ఆయన షేర్లను మరొక వ్యక్తికి బదిలీ చేసి కంపెనీని నడపవచ్చు. పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. పూర్తి వివరాలతో ఆర్థిక ఫలితాలను ప్రకటించనక్కర్లేదు. ఎందుకంటే పబ్లిక్‌(ప్రజలకు)కు ఇక్కడ షేర్లు ఉండవు కాబట్టి.
వాటాదార్లు అంగీకరిస్తే తప్ప షేర్లను బదిలీ చేసుకోలేకపోవడమే ప్రతికూలత.
(పబ్లిక్‌) లిమిటెడ్‌ కంపెనీ అంటే
బ్లిక్‌ కంపెనీ అంటే షేర్లను సాధారణ ప్రజలకు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేయడానికి అనుమతి ఉన్న కంపెనీ అని. కనీసం ఒక స్టాక్‌ ఎక్స్ఛేంజీలో అది ట్రేడయి ఉండాలి. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా కేవలం ఇన్‌కార్పొరేటెడ్‌ ధ్రువీకరణ పత్రాన్ని పొంది వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుండదు. పబ్లిక్‌ కంపెనీని నిర్వహించాలంటే ట్రేడింగ్‌ సర్టిఫికెట్‌ అనే మరో ధ్రువీకరణ పత్రాన్నీ పొందాలి.
ప్రయోజనాలు
కనీసం ఏడుగురు సభ్యుల(గరిష్ఠం అపరిమితం)తోనే దీనిని ప్రారంభించవచ్చు. పబ్లిక్‌ లిమిటెడ్‌లో లయబులిటీ(బాధ్యత) పరిమితంగా ఉంటుంది. చెల్లింపులకు ఏ ఒక్క వాటాదారో బాధ్యత వహించరు. ఇదో ప్రత్యేక చట్టబద్ధ కంపెనీ కాబట్టి ప్రతీ వాటాదారు కూడా అందులో భాగస్వామే. ఆ విధంగా చూస్తే వాటాదార్లకు బాధ్యత, నష్టభయం తక్కువన్నమాట.
పారదర్శకత ఉంటుంది. ఎలాగంటే పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఆర్థిక ఫలితాలను బయటకు వెల్లడించాల్సి ఉంటుంది. తద్వారా వాటాదార్లు తమ కంపెనీ పనితీరుపై అంచనాకు రావొచ్చు.
కంపెనీ తన అవసరాలను బట్టి స్టాక్‌ మార్కెట్లో షేర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమీకరించుకోవచ్చు. బాండ్లు, డిబెంచర్లనూ జారీ చేసి నిధులను అందిపుచ్చుకోవచ్చు.
ప్రతికూలతలు
ప్రజల ముందుకు వెళ్లడమనేది వ్యయంతో కూడుకున్న, సమయం ఎక్కువ పట్టే ప్రక్రియ. సెబీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహారాలను నడపాల్సి ఉంటుంది. ఇందు కోసం అకౌంటెంట్లు, అండర్‌రైటర్ల వంటి వారిని కంపెనీ నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ సారి నిధుల సమీకరణ కష్టం.
ఒక్కసారి ప్రైవేట్‌ కంపెనీ పబ్లిక్‌ అయితే కంపెనీ యజమాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేడు. మెజారిటీ వాటాదారు తానే అయినప్పటికీ.. మైనారిటీ వాటాదార్ల సమ్మతినీ పొందాల్సిందే.